Tuesday 14 February 2012

తేరా నామ్ ఏక్ సహారా ?!


తేరా నామ్ ఏక్ సహారా ? !
(నీ నామమే ఏకైక ఆధారం)
దీన్ని నవలిక గానూ, పెద్ద కథగానూ చూడడం కంటే, రచయిత స్వానుభవంగా చూడడమే సరైన విషయంగా తోస్తుంది. దీన్ని గురించి మాట్లాడాలంటే రచయిత కలం ప్రతిభ కంటే, అనుభూతుల గాఢతని ఏ రీతిగా వెలువరించారు ? అసలెందుకు ఆ అవసరం వచ్చిందీ అనే అంశం మీదే మాట్లాడాలనుకుంటున్నా.
ముందు పేజీలో నరేష్ కృతజ్ఞతలు కూడా ఇచ్చుకోలేనని చెప్పినా, ఏనాడూ వేడుకోకపోయినా ఆ దైవమే తన దూతను ఉష రూపంలో పంపాడని ఎపిలోగ్ ముగిస్తూ చివరి పేజీలో ఆయన తన అంతరంగం పరిచారు. ఈ నాటి వాస్తవం ఇదే కాబట్టి ‘ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’ అన్న న్యాయంతో ఈనాడు ఆయన సంతోషంగా ఉన్నారు అనే భరోసాతోనే ఈ పుస్తకాన్ని సమీక్షించవచ్చునని నాకు అనిపిస్తోంది. నిజానికి తను ఒకటి కావాలనుకోవచ్చు. కానీ ‘వీడికేం కావాలో వీడికి తెలియడం లేదు, ఉష వల్లే వీడు సంతోషంగా ఉండగలుగుతాడు’ అని ప్రీ డిసైడ్ అయిపోయింది. అందుకే అన్నీ ఒక్కొక్కటీ తప్పుకున్నాయి.
‘తేరా నామ్ ఏక్ సహారా’ లో తన హృదయంలో సంచలనం రేపిన ఘడియలను గురించి నరేష్ మాట్లాడారు. ఎందుకు రాశారో కూడా ఆయన చెప్పారు. అదెందుకు నవల రూపంలో వచ్చిందో , మిత్రులు, బంధువులు, హితులు సూచించిన పలు సలహాల అనంతరం కూడా ఎక్కడా ఏ మార్పులూ లేకుండా ఈ పుస్తకం ఆ రూపం అలాగే ఎందుకు తీసుకుందో కూడా పేర్కొన్నారు. ఇక ఆ పరంగా ఏ సందేహమూ మిగలడానికి వీల్లేదు.
ఈ పుస్తకం చేతిలోకి తీసుకున్నాక నేను పూర్తయ్యే వరకూ ఆపలేదు. పుస్తకంగా రాక ముందూ నాకు ఆ సబ్జెక్టు తెలుసు. అయితే పుస్తకంగా వచ్చాక నరేష్ అంతరంగానుభూతిని దర్శింప చేసే బొమ్మలకి వాటిదైన ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ పుస్తకంలో. తాల్ ఫిల్మ్ లో ఓ ఖవ్వాలీలో ‘ఊపర్ రబ్ హై , నీచే ఇష్క్ హై, ఇన్ దోనోంకే బీచ్ మే సబ్ హై’ (పైన ఆ భగవంతుడూ… క్రింద ఈ ప్రేమా….ఇక సమస్తమూ ఈ రెండింటి మధ్యనే…) అన్నాడొక కవి.
శబ్దం నుంచి శబ్దాతీత స్థితికి తీసికెళ్లే ఒక దృశ్య కావ్యం. ధ్వన్యాకారుడు ఆనంద వర్ధనుడు ‘కావ్యానికి ధ్వనే ఆత్మ’ అంటాడు. ఈ రచనలో అడుగడుగునా ధ్వని ఉంది. అదీ సిమిలీలు, రూపకాలు, ఆక్జిమోరన్లూ, ఉత్ప్రేక్షలతో కలిసి పలికింది. రచయిత మనతో చెబుతున్నట్టే ఉన్న ఆత్మ కథన శైలి… అనుభూతుల గాఢత వల్ల గుండె బరువెక్కించే కథ…కథనం…
అర్జునిడి బాణం తోడిన పాతాళగంగ భారతి స్వర ధార. రాబోయే ఘడియలకు ముందస్తు సూచన….శిలల మీద రాలి తలలు బద్దలైన రంగు పూలని పక్కకి ఊడ్చి. భారతికి కర చాలనం ఇచ్చి తొలి స్పర్శే వీడ్కోలు చేయడం ఇష్టం లేకపోవడం … సంధ్యా భీభత్సం వంటి రూపకాలు, కాగితాల చట్రాతి మీద తల బద్దలు కొట్టుకుని చిల్ల పెంకులై చెల్లా చెదరైన మనసుని అక్షరాలుగా పేర్చి నివేదన చేయడం…ఒంటిగా చేసిన జంట సంతకాల చేవ్రాలు నిర్లక్ష్యపు నిప్పుల్లో కాలి, నుసిగా రేగి, పొగలా కమ్మి కనుమరుగవడం వంటి అనుభూతుల గాఢత రచయిత అంతరాత్మ నుంచి బయల్దేరి సూటిగా పాఠకుడి అంతరాత్మనే చేరుతుంది.
వినబోయే మాటలకు ముందుగానే వాటి పర్యవసానం వెల్లడించే ప్రకృతి దృశ్యాలు…
తెల్ల చొక్కా భుజం మీద పడిన కాకి రెట్టని తుడుచుకుంటుంటే నడిచొచ్చింది భారతి, గడ్డిపోచల్ని తొక్కి కొత్త డొంక వేస్తున్న మట్టి కాళ్లతో..
…వద్దన్నారు… నీకూ నాకు అసలు కుదరదన్నారు… ఇక ముందెప్పుడూ నన్ను కలవకూడదని కూడా చెప్పారు…
63 వ పేజీలో మోడు మానవ ముఖంతో రోదిస్తున్న తీరు… చూశారా…
గాన కళానిధి సుబ్బులక్ష్మిని గురించి మేఘ మృదంగాల ఉరుము దరువు కంటే ముందే చేరే మెరుపు తేజంలా. నిండైన నీలం రంగు కంచి పట్టు చీరలో స్వభావాన్ని సూచిస్తున్న మెత్తని నడకతో వస్తోంది రాగాన్ని వెదుక్కుంటున్న పదం, పరాన్ని అన్వేషిస్తున్న ఇహం …అంటూ ఇంత సంక్షిప్తంగా , అందంగా, గాఢతనీ, ఔన్నత్యాన్నీ పట్టివ్వగలిగే పదాలు మరెక్కడా నేను చూడలేదు. శబ్దాతీత సౌందర్యాన్ని కనిపెట్టగలిగిన ఆ అంతర్దృష్టే జీబురు జుట్టు మాయా ప్రపంచాన్నీ ఆవిష్కరించింది… ఎక్కడా తనకు విశ్వాసం కుదరలేదు. ఆ కుదరనితనాన్ని స్పష్టమైన శబ్దాల్లో చెప్పడానికీ ఎక్కడా వెనుదీయలేదు. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం దగ్గర నరేష్ అర క్షణం కూడా ఆగరేమో.
సుబ్బులక్ష్మి దేవుడు ఉన్నాడని నమ్మి పాడితే, ఆ దేవుడు దిగి వస్తాడని మాత్రం నమ్ముతారని అనిపిస్తుంది. అందుకు ఆమె దగ్గర సాష్టాంగ పడ్డారు. అది విలువైన ఆరాధన. అందరూ భగవాన్ గా కొలిచే , సాగిల పడే వ్యక్తి దగ్గర చేయలేదు ఆ సాష్టాంగం. అంతరాత్మను కాదనుకుని నరేష్ ఎక్కడా ఎప్పుడూ తలవంచలేదు. ఇది వ్యక్తిత్వ ఔన్నత్యం. జానకి రామయ్యగారితో వాగ్వాద సందర్భంలో కూడా ఇది గమనించవచ్చు.
భారతి పాటకు పరుగున వచ్చి వరాలివ్వని వాడు దేవుడా అని సందేహం. అది భారతి పట్ల ప్రేమ కంటే ఆమె అంతటి ఆర్తితో పాడడాన్ని ఇష్టపడి అలా అన్నారనిపిస్తుంది. తనకిష్టమైన భారతికి దేవుడెందుకు వరమివ్వడని వకాల్తాతో అన్న మాటలు కావవి.
కీర్తి ప్రతిష్ఠలకు ఆశించి చేసిన రచన కాదిది. భక్తులకు ఉండే విశ్వాసం కొంత మౌఢ్యానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కథాంశం సత్యమే అయినా కోట్లాది మంది భక్తులకు జ్ఞానోదయం అయ్యే అవకాశమూ లేదు. ‘మణి రత్నం చిత్రంలో ఏమిటీ గొప్ప?’ అతడి కథ సింపుల్ గా ఉంటుంది. కానీ కథన వైచిత్రి చెప్పుకోదగ్గది. కెమేరా పనితనాన్ని అతడు గొప్పగా ఉపయోగించుకుంటాడు. పాటలో 150 ఫ్రేములు కనిపిస్తాయి. ఆ వివిధ భంగిమల్లోంచి ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని సంక్షిప్తంగా చూపించేస్తాడు. శ్రీ నరేష్ కథనం నాకు మణి రత్నం సిన్మా లానే ఉంటుంది. అక్కడ కెమేరా పని ఇక్కడ అక్షరం పని. అంతే తేడా.
మనసుకు అద్దం పట్టినట్లున్న ఆ బొమ్మలు చాలా బాగున్నాయి. 60 పేజీలో బొమ్మ ‘జాగ్ తే రహో’ అంతిమ దృశ్యంలోని నర్గీస్, రాజ్ కపూర్ లను తలపించింది. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. అందులోనూ ఆ అంతిమ దృశ్యం…’జాగో మోహన్ ప్యారే’ పాడుతూ కృష్ణ మందిరంలో వనకన్యలా, దేవతా మూర్తిలాంటి నర్గీస్ పాట పాడుతూ పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుంది. ప్రపంచ పంకిలం చూసి, రోత పుట్టి, భీతావహుడైన రాజ్ కపూర్ అటుగా వస్తాడు. తానూ దోసిలొగ్గితే, అదిగో…అలాగే నీరు పోస్తుంది.
కచేరీ ముందు గాయకుడు గొంతు సవరించుకోవడంలో గుర్తింపుకి నోచని ఏదో తీయదనం ఉందనిపిస్తుంది. గుడ్డు పగిలి, మొలిచీ మొలవని చిట్టి రెక్కలు విప్పుతూ గువ్వ పిట్టలు చేసే కువకువలు విన్నట్టుంటుంది. విరామ నిశ్శబ్దపు తెరల జారుముడిని సుతారంగా లాగినప్పుడు చిరు గంటలు మంద్రంగా మేలుకున్నట్టుంటుంది. తీగల్లోకి ఒత్తిగిల్లిన వాయిద్యాలు ఒక్కొక్కటే లేచి ఒళ్లు విరవడం…
…ఇలా సాగే వర్ణనలో ప్రకృతి మానవ కన్యగా హొయలొలికింది. తన ప్రగాఢానుభూతిని చదువరి గుండెల్లోకి నేరుగా చేర్చింది ఈ రచన.
నవ రసాల్లో మనిషి నిరంతరం ఏదో ఒక రసానుభూతిలో ఉంటాడు. ఆ రసానుభవాన్ని అందజేయడంలో ప్రకృతి తోడు లేకుండా ఏ ఒక్కసారీ ప్రయత్నించలేదు రచయిత. భీభత్స, హాస్య, శృంగార, శాంత, కరుణ రసాలతోనూ, సజీవమైన ప్రకృతి కాంత సాయంతోనే కావ్యం లాంటి ఈ రచన ముందుకు సాగింది.
(7 వ పేజీలో) వెండి పోగుల పల్చని నీరెండ…ఒద్దికగా వీస్తున్న చల్లని గాలి..నిండైన నమ్మకంలా వెయ్యి బాహువుల్తో విస్తరించిన మహా వృక్షం… ఆశీర్వచనాల మెత్తని నీడ…తన్మయంలో తలలూపే కొమ్మల్లోంచి ఆమోదంగా రాల్తున్న పూలు…కానీ రెండవ పేరాలోనే సందేహం కూడా వ్యక్తం చేస్తూ, ప్రకృతి రహస్యాత్మక ప్రవృత్తి ద్వారా… ఏమో ..ఏ కానుందో అనే సంశయంలో పడవేసేదిగానూ ఉంది. మొదటి రెండు పేరాల్లో ఆశ, చివరి పరిణామాలూ రెండూ స్పష్టమవుతాయి.
(61 వ పేజీలో) అది స్పష్టంగా సూది మొనల నీరెండ… నక్కి నక్కి వీస్తున్న నంగిరి గాలి… విస్తరించిన అపనమ్మకమై వెయ్యి చేతుల్తో లంఘిస్తున్న మాను… అనుమానంగా కదలాడే నీడ… అసహనంగా ఊగే కొమ్మల్లోంచి పట్టు తప్పి పడుతున్న పూలు గా మారింది. ప్రకృతి చైతన్యంతో తొణికిసలాడుతూ, మానవ స్పందనలను కలిగి ఉండడమే మానవీకరణ అలంకారం. అది కావ్యం నిండా పుష్కలంగా వర్ధిల్లింది.
డోలాయమానంగా ఉన్న తన భవితవ్యం చూపించడానికి సూర్యుడు మూసిన మబ్బుల్ని జరీ అంచుతో మురిపించడం గురించి చెప్తారు.
ఆవరించిన నిశ్శబ్దం నిట్ట నిలువునా చీలి, నడి రాతిరి యమునలా దారివ్వడం …
మోహరించిన శబ్ద రాహిత్యం, తన రాకతో దాన్ని నిలువునా బాబా చీల్చడం, జరాసంధుడి భాగాల్లా అది కలిసి పోతుండడం, బద్దలైన ఎన్ని నెత్తుటి గుండెలు తొక్కుకుంటూ వస్తున్నారో.. గురివింద పువ్వులా…
కాగితాల చట్రాతి మీద తల బద్దలు కొట్టుకుని చిల్ల పెంకులై చెల్లా చెదరైన మనసుని అక్షరాలుగా పేర్చి నివేదన చేయడం…ఒంటిగా చేసిన జంట సంతకాల చేవ్రాలు నిర్లక్ష్యపు నిప్పుల్లో కాలి, నుసిగా రేగి, పొగలా కమ్మి కనుమరుగవడం.
కాండం తొలిచే పురుగు పట్ల మొక్కకుండే ఏవగింపు … వంటి పదాల్లో సజీవ చిత్రమేదో కదులుతూ ఉంది.
బంగాళ దుంప, ఇడ్లీల ప్రసంగం మొత్తం పాఠకులు మంద స్మితితోనే, మనసులో చక్కలిగింతలతోనే చదువుకుంటారు.
డాక్టరుకీ, భారతికీ మధ్య జరిగినట్టుగా చేసిన పరికల్పన కూడా పౌరాణికత స్ఫురింపచేస్తున్న పదాలతో రసస్ఫోరకంగా ఉంది.
(17 వ పేజీలో) ‘నమ్మకమైన ఎన్నిక గురించి చెప్పిన సత్యం నూటికి నూరుపాళ్లు ఏకీభవించదగింది. సత్య సాయి అయినా, నిత్య సాయి అయినా అది మనకు నచ్చిన ఎంపిక.’
చేతి రుమాలు విసిరి కుర్చీ సొంతమన్నట్లు మాట వరసకు వేసిన పసుపుతాడుతో తన ఇలాకా అని సదరు మొగుడు చెప్పుకుంటున్నా… పసుపుతాళ్లు బంధించలేని బంధాలను అలవోకగా చెప్పడం.
నాస్తికత ఛాయల్లో పెరిగినా బహుశా అది కొంచెం తార్కికత నేర్పి ఉంటుందేమో గానీ మనిషికి సహజంగా రసజ్ఞతను దూరం చేయలేదు. సివిల్ ఇంజనీరింగ్ చదివీ, అదే వృత్తిలో స్థిరపడలేకపోవడం, తన passion కు విలువనిచ్చి అక్షర ప్రపంచంలోకి చోటు చేసుకోవడం, అక్కడే స్థిరంగా ఉండడం అనేది అతి పెద్ద ఫీటు.
ఆశావహంగా ఉన్నప్పుడు
హతాశుడైనప్పుడు
ప్రతి జీవితంలోనూ కొన్ని ఘటనల సమాహారం సత్యాన్ని వెలికి తీస్తుంది.
ఇక్కడ శీర్షికలో చివర చేర్చిన ‘? !’ చిహ్నాలతోనే ‘తేరా నామ్ ఏక్ సహారా’ అనే పదం పాడుకోవడానికే తప్ప వాస్తవం కాదనేది సత్య సాయికి సంబంధించిన సత్యాన్వేషణ.
ఒక థాట్ నుంచి సాకారమైన ఈ తెలుపు నలుపుల పుస్తకం అనుభూతుల గాఢతనూ, హృదయ స్వచ్ఛతనూ, అలౌకికత్వాన్నీ అలవోకగా ప్రదర్శించింది.
సత్య సాయి పేరు మీద ప్రపంచం అంతటా లక్షల కోట్లాది రూపాయలు వసూలైంది. సేవా సంస్థలు అన్నారు. ఆధ్యాత్మికత అన్నారు. జనం వెర్రికి ఎప్పుడూ ఒక ఆలంబన కావాలి. అది అదృష్ట వశాత్తూ సత్య సాయి అవతారం అయింది. గాన కోకిలలు పాడాయి. బృంద గానాలూ, కచ్చేరీలు ఎవరి ప్రతిభను వారు ప్రదర్శించడానికి ఓ వేదిక దొరికింది.
కనీసం ప్రపంచానికి మరుగైనా తన సత్యం ఆ సత్య సాయికి తెలుసు. ఆయనను గురించిన వాస్తవం కొద్ది మోతాదులో అయినా సరే, అర్థమై ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారంటే, పర్యవసానాలు ఇలాగే ఉంటాయనేందుకు నమూనా ఈ కథ. మరీ కక్ష తీర్చుకునే చర్యలు చేపట్టడానికి ఇటు నుంచి అంత ధిక్కారం లేదు. కాబట్టి, అదే స్థాయిలో అటు నుంచి పొగ బెట్టడం జరిగిందనిపిస్తుంది.
ఒక వేళ తిరుగుబాటుదార్లు ఓడితే పోయేది కొంచెమే. అదీ వ్యక్తిగత నష్టాలే…రచయితకి జరిగినట్టు. కానీ భక్తుల్లో వచ్చే తిరుగుబాట్లకు వెసులుబాటు ఇస్తే, ఆయన వైపు సామ్రాజ్యాలే కూల్తాయి. ఒకానొక స్థాయి తర్వాత ధిక్కారం సైపడం కష్టం అవుతుంది. తన వాస్తవికత తనకు తెలిసినంత బాగా రచయితకీ తెలిసిందనే ఒక అనీజీనెస్…అది పోగొట్టుకోవడానికి డౌన్ చేయాలి…అవతలి వ్యక్తిని…ఆయన చేశారు. తన చేతిలో ఉన్న తురుఫు ముక్క భారతిని కలుసుకోవద్దని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడే నరేష్ తట్టుకోలేకపోయారన్నది నిజం. తనకు ఏ అర్హతా లేదని సాయికి తన అంతరాత్మలోనైనా తెలుసుగా, ఎదుటివారి తల రాతలను మార్చేందుకు సాయి ఆ రకంగా సాహసించడంపై రచయితకి గల అసహనం అడుగడుగునా ప్రదర్శితమైంది. ఆ అసహనం అర్థ రహితం కాదు.
ముందూ వెనకల్లేని శుద్ధ వచనం లాంటి ‘ఇక్కడేముందీ, అంతా అక్కడే వుంది’ వాక్యాల్లోనూ,
మోహరించిన శబ్ద రాహిత్యం, తన రాకతో దాన్ని నిలువునా బాబా చీల్చడం, జరాసంధుడి భాగాల్లా అది కలిసి పోతుండడం, బద్దలైన ఎన్ని నెత్తుటి గుండెలు తొక్కుకుంటూ వస్తున్నారో.. గురివింద పువ్వులా… తిరనాళ్లలో తప్పి పోయిన పిల్లాడిలా బాబా జనం మధ్య తిరుగాడుతూ ఉండడం …వంటి చోట్లా ప్రదర్శితమవుతుంది. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, నరేష్ కి తేరా నామ్ ఏక్ సహారా రాయాల్సిన అవసరమే ఉండి ఉండక పోవచ్చు. అనంతమైన సంఘటనలు జరగనూ వచ్చు. అనంతమైన సంఘటనలు జరగకపోనూ వచ్చు.
రచయితది నాస్తిక ధోరణి కాబట్టి , దైవ ధిక్కారం చేశారా? అంటే, కాదనిపిస్తుంది. సుబ్బులక్షి తన అంతరంగాన్ని ఎక్కడ కేంద్రీకరించారో, కబీరు రాముణ్ణీ, మీరా కృష్ణుణ్ణీ తన స్వరంతో ఎలా వెదుక్కుంటున్నారో తట్టిన దృష్టి నాస్తిక , ఆస్తిక పరిభాషలకు అతీతమైంది. కానీ ఒకటి… ఏం చెబుతున్నారో…అది వారు చేస్తున్నారా…అనే ఒక పరిశీలన ఉంది. ఎవరు ఏ ప్రతిపాదన చేసినా, ఆ ప్రతిపాదనలో వారి అంతరాత్మ ఉందా లేదా అని చూసే నిశితమైన చూపు ఉంది. ఎవరి స్థాయికి వారిని అర్థం చేసుకుని, వారి ఎరీనాలో వారిని స్వేచ్ఛగా తిరగడానికి వదిలి వేస్తూ ఉండే ఒక స్వభావం వల్ల ఒకప్పుడు సుజీతోనూ, తర్వాత కాలంలో భారతితోనూ అసందర్భాలు ఎదురయ్యాయి.
ప్లాసిబో అనే మందు పేరు చెప్తారు హోమియోలో. అది మందు కాదు. కొందరు పేషెంట్లకు జబ్బు ఉండదు. లేదా వచ్చిన జబ్బు ఒక్క రోజులో దానంతట అదే తగ్గి పోతుంది. అలాంటి స్థితిలో తన జబ్బుకి డాక్టరు ఇచ్చిన పిల్స్ వేసుకుంటే కానీ నయం కాదనే ఫీలింగ్ లో ఆ పేషెంట్ ఉంటే, డాక్టరు ఈ ప్లాసిబో ఇస్తాడు. అంటే ఏ మందూ లేని ఉత్త పంచదార గుళికలన్నమాట. వేసుకున్న పేషెంట్ మందుకే నయమైందనుకుంటాడు. కానీ అసలు రహస్యం డాక్టరుకి తెలుసు.
ప్రజలు ఎంచుకునే డాక్టరు ఒకో సారి సత్య సాయి లాంటి వ్యక్తులు అవుతారు. వారి ప్రభ వెలుగుతుంది. ఇలాంటి చరిత్రలు కోకొల్లలుగా నడుస్తూనే ఉన్నాయి ఇంకా.
ఫిర్ వహీ దిల్ కో బేకరారీ హై
సీనా జోయా యే జఖ్మెకారీ హై
నా మనసు మళ్లీ వ్యాకులమవుతోంది, గుండె చెలమల్లోకి చూస్తే గాయమే ఉంది. అలా గాయం ఎందుకైందీ అంటే,
ఫిగర్ జిగర్ ఖోద్ నే లగా నాఖూన్
ఆమ్ దే ఫస్ లే లాలకారీ హై
ఇక్కడ హృదయాన్ని గోరు త్రవ్వడంగా చెప్పారు ఇక్కడ హృదయం గాలిబ్ దీ, గోరు ప్రియురాలిదీ అయి ఉండవచ్చు. అలా చేయడం ద్వారా ఆమె నాటే బీజాలన్నీ (‌‍‌జ్ఞాపకాలు) ఎప్పటికీ గాయాలోడుతూ ఉండేవిగానే ఉంటాయి. (పంట కూడా రాగ రంజితంగానే ఉంటుంది.) మళ్లీ ఓ కొత్త పరిచయం గుండెను కుదుపుతోంది అని భావం.
ఈ పుస్తకం నాకు నచ్చిన అతి కొద్ది పుస్తకాల్లో ఒకటి.
****************
తేరా నామ్ ఏక్ సహారా?!
నరేష్ నున్నా
సెప్టెంబరు 2011
ప్రచురణ: అంజలి గ్రంథమాల
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
Flat no. 3, MIG-II
Block 6, APHB,
Baghlimgampally, Hyderabad, 500 044
Phone: 40-2767 8430
E-mail: palapittabooks@gmail.com
71 పేజీలు; 50 రూ.

Monday 13 February 2012

ఒబామా – స్ఫూర్తిదాయక విజయగాథ

పాలపిట్ట బుక్స్ ప్రచురించిన ఈ 152 పేజీల పుస్తకం ప్రజాస్వామ్య ప్రస్థానంలో నిలిచి గెలిచిన ఒక సామాన్యుడి సాహసగాథని తెలుపుతుంది. అమెరికా చరిత్రలో ఒక నల్లజాతీయుడు అధ్యక్ష పదవికి పోటీపడడం, గెలవడం ఇదే తొలిసారి. అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా మార్పుకి ఓ చిహ్నం. రాజకీయాలలో, పరిపాలనలో, సకల రంగాలలో మార్పును ఆశించేవారికి స్ఫూర్తి ఒబామా. నవంబరు 4, 2008 ఓ చారిత్రాత్మక దినం. అత్యంత వర్ణవివక్షని చూపిన దేశం ఒబామాని అధ్యక్షుడిగా ఎన్నుకోడం ద్వారా తనని తాను సరిదిద్దుకుంది. బానిసలుగా అమ్మిన గడ్డమీదే నల్లజాతీయుడికి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిందమెరికా. ఈ నిశబ్ద విప్లవానికి నాంది పలికిన బరాక్ ఒబామా వెనుక ఘనమైన వారసత్వం లేదు, అతడేమీ పోరాట చరిత్ర ఉన్న నేతా కాదు. మరింత మహత్తర విజయం ఎలా సాధ్యమైంది? దీనికి తోడ్పడిన నేపధ్యమేది? దీనికి మూలాలెక్కడ? ఈ ప్రశ్నలకి ఒబామా జీవితమే సమాధానం.
‘సరైన సమయంలో సరైన వ్యక్తినని ఋజువు చేసుకోడం ద్వారా ఒబామా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అమెరికా చరిత్రలో మార్పుకు వేగుచుక్క అయ్యాడు’ అని అంటారు రచయిత గుడిపాటి. ఇంతటి అద్భుతానికి సూత్రధారి, పాత్రధారి అయిన వ్యక్తి జీవనయానం ఎలాంటిదో తెలియజెప్పే ప్రయత్నమే ఈ పుస్తకం. ఒబామా అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపట్టిన రెండు నెలల తర్వాత ఈ పుస్తకం విడుదలైంది. దృఢ సంకల్పం, నిజాయితీ, పట్టుదల ఉన్న చోట లక్ష్యసాధన సులువుని తెలిపిన విజయగాథ ఒబామాది.
బరాక్ హుస్సేన్ ఒబామా 4 ఆగస్టు, 1961 నాడు అమెరికాలోని హవాయి రాజధాని హొనొలూలులో పుట్టాడు. ఒబామా తండ్రి బరాక్ ఒబామా సీనియర్ కెన్యా దేశస్తుడు. తల్లి స్టాన్లీ ఆన్‌డన్‌హమ్ శ్వేత జాతీయురాలు. అయితే ఒబామా పుట్టాకా, మూడేళ్ళకి వారిద్దరు విడిపోయారు. 1965లో ఆన్, లోలో అనే ఇండోనేసియన్ విద్యార్ధిని వివాహం చేసుకుంది. ఒబమా తనకు ఆరేళ్ళ వయసులో తల్లితోను, లోలోతోను కలిసి జకార్తాకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు సంపన్న దేశమైన అమెరికాలో నగరాలని, ప్రజల జీవనాన్ని చూసిన ఒబామా తొలిసారిగా పేదరికాన్ని దగ్గరగా చూసాడు. ఒబామాని తన కొడుకుగానే మిత్రులకు పరిచయం చేసేవాడు లోలో. అతని చదువులో, ఆటపాటల్లో లోలో భాగస్వామ్యం వహించేవాడు. ధైర్యాన్నిచ్చే మాటలను లోలో చెబితే, నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం గురించి ఆన్ చెప్పింది.
విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ బరాక్, ఆన్‌ల మధ్య శత్రుత్వం లేదు. తను మరో పెళ్ళి చేసుకున్నప్పటికీ, అసలు తండ్రితో కొడుకుకి అనుబంధం ఏర్పడాలని ఆన్ ఆశించింది. అందుకే ఒక పేద దేశంలో పుట్టి మేకల కాపరిగా పెరిగి కష్టపడి చదువుకుని ఎదిగివచ్చిన బరాక్ ఒబామా సీనియర్ గురించి కొడుకు మనసుని ఆకట్టుకునేలా చెప్పింది. మొదట్లో అర్ధం కాకపోయినా, తన తల్లిదండ్రుల వివాహం విఫలమైందని, వారిద్దరు విడిపోయారని క్రమంగా గ్రహించాడు ఒబామా. అమ్మానాన్నల జాతులు, దేశాలు వేరయినప్పటికీ, ఒబామా అమెరికా వాసిగానే పెరిగాడు. ఆఫ్రో-అమెరికన్ సంతతికి చెందిన వాడిగా, నల్ల జాతీయునిగానే పేరొందాడు. తల్లిదండ్రుల విలక్షణమైన కుటుంబ నేపధ్యాలు ఒబామా పెంపకం పైన, వ్యక్తిత్వం పైన ప్రభావం చూపాయి. ఈ నేపధ్యంలోనే దృఢచిత్తం, సంయమనం, పట్టుదలతో పనిచేయడం వంటి లక్షణాలు ఒబామాలో రూపొందాయని అంటారు రచయిత.
హవాయిలో హైస్కూలు చదువు పూర్తి చేసిన ఒబామా ఆ తర్వాత, బి. ఎ చదవడం కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఆక్సిడెంటల్ కాలేజిలో చేరాడు. ఇక్కడ నేర్చుకున్న పాఠాలే ఒబామా జీవన యానంలో అతడి మనోవికాసానికి దారితీసాయి. వ్యక్తిత్వ వికాసానికి పునాది వేసాయి. 1981లో రెండో సంవత్సరం చదువుని న్యూయార్క్‌నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో కొనసాగించాడు. ఇదే విశ్యవిద్వాలయం నుంచి 1983లో రాజనీతిశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు ఒబామా. ఈ క్రమంలో తన జాతి, తన మూలాలకు సంబంధించిన స్పష్టత కలిగిందతనికి.
చదువైపోగానే ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికింది ఒబామాకి. అయితే, తన కలలకు, ఆకాంక్షలకు ఏ మాత్రం పొంతనలేని ఆ ఉద్యోగం చేయలేక, వదిలేసాడు. ఆ తర్వాత పేదవాళ్ళకు సాయపడడం, వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు కృషిచేసే నైబర్‌హుడ్ యాక్టివిస్ట్‌గా షికాగో నగరంలో చేరాడు. ప్రపంచం ఇప్పటికన్నా మెరుగ్గా, ఆశావహంగా ఉండేలా చేయడానికి అవకాశం కల్పించిందా ఉద్యోగం. ప్రపంచంలో తను భరించలేని అన్యాయమైన, ఆమోదయోగ్యం కాని విధానాలను మార్చడానికి కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేయడం ద్వారా తొలి అడుగు వేసాడు ఒబామా. మార్పు దిశగా ప్రయాణించాలన్న అతని కలలు ఆచరణరూపం దాల్చడానకి షికాగో ఒక ప్రయోగశాల అయ్యింది. కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేయడం ద్వారా ప్రజలకు చేరువయ్యాడు, ప్రజల కష్టాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. అధికారుల వద్దకు వెళ్ళినప్పుడు తను ముందుండి మాట్లాడక, బాధితులతో మాట్లాడించాడు. ఎవరైతే సమస్యలతో సతమతమవుతున్నారో వారు స్పందించడానికి అవకాశం కల్పించాడు. ఎంతో మందితో కలిసి పనిచేసాడు, అతి సామాన్యులైన వారిలో ఆత్మవిశ్వాసం ప్రోదిచేసాడు. మనుషులని ప్రోత్సహించడం, ఉత్సాహపరచడం ఒబామాలో ప్రముఖంగా కనపడే లక్షణాలు. ఇవి షికాగో ఉన్న కాలంలో మరింత పదును తేలాయి. ఈ మూడేళ్ళ కాలంలో రాజకీయవేత్తకి ఉండాల్సిన అన్ని నాయకత్వ లక్షణాలను వంటపట్టించుకున్నాడు ఒబామా.
షికాగోలో ఎదురైన సమస్యలు, ‘లా’ చదవాలనే ప్రేరణని ఒబామాలో కలిగించాయి. ఫలితంగా హార్వార్డ్ యూనివర్సిటీలో లా డిగ్రీ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నాడు. 1987లో అతనికి సీటు లభించింది. 1991లో చదువు పూర్తయ్యింది. లా స్కూలులో పరస్పర విరుద్ధ భావాలున్న విద్యార్ధుల మధ్య పనిచేయడం ఒబామా అనుభవాన్ని విస్తృతం చేసింది. అధ్యయనం వలన అతని ప్రాపంచిక అవగాహనలో గణనీయమైన మార్పువచ్చింది. నాయకత్వ లక్షణాలు మరింతగా మెరుగు పడ్డాయి.
లా డిగ్రీతో షికాగో తిరిగొచ్చి, సివిల్‌రైట్స్ లాయర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అంతే కాకుండా పార్ట్ టైం అధ్యాపకుడిగా షికాగో యూనివర్సిటీలో లా డిపార్టుమెంటులో రాజ్యాంగ చట్టం బోధించాడు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఒబామాకి 1992లో ఇల్లినాయిలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లభించింది. ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి, ఓటర్లుగా నమోదు కాని లక్షన్నర మంది ఆఫ్రో-అమెరికన్లను ఓటర్లుగా నమోదు చేయించాడు. ఈ కార్యక్రమం విజయవంతమై, ఒబామాకి గుర్తింపుని తెచ్చింది.
చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోడం, తల్లి మరొకరిని పెళ్ళాడడం, తండ్రి బహుభార్యలని చేపట్టడం వంటి అంశాలు ఒబామాని ఆలోజింపజేసాయి. అందుకే బలమైన, అనురాగపూరితమైన వివాహబంధాన్ని ఆశించాడు. ఫలితంగా 1989లో పరిచయమైన మిషెల్ రాబిన్‌సన్‌తో దాదాపు నాలుగేళ్ళ పాటు స్నేహం చేసి 3 అక్టోబరు 1992నాడు వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి 1998లో మొదటి కూతురు మలై, 2001లో రెండో కూతురు నటాషా జన్మించారు. కుటుంబ జీవనంలోని శాంతి, హాయి, తేలికపడిన మనస్తత్వం సామాజిక రాజకీయ జీవితంలో ఒబామా ఉన్నతికి తోడ్పడ్డాయి. న్యాయవాదిగా కన్నా, రాజకీయాల్లోకి ప్రవేశిస్తేనే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతానని అనుకున్నాడు ఒబామా. పనులు జరగాలంటే నిర్ణయాధికారం ఉండాలని, నిర్ణయాత్మక శక్తిగా నిలవాలని, విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం వహించాలని గ్రహించాడు. ఈ క్రమంలో 1995లో ఇల్లినోయి రాష్ట్ర సెనెటర్‌గా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ ఎన్నికల ప్రచార క్రమంలో మొదటిసారిగా తన అభిప్రాయాలని, విశ్వాసాలని షికాగోలో, ఇల్లినోయిలో ఉన్న ప్రజలకి తెలియజేసే అవకాశం అతనికి లభించింది. ‘మార్పు’ అనే మాట ఆనాటి నుంచి అతనినోట వినిపించడం ఆరంభమైంది. భిన్న ధృవాలుగా ఉన్న వారి మధ్య విభేదాలను పరిష్కరించి, కలిసిపనిచేయడానికి ఒప్పించిన తీరు ఒబామాకి మంచి ప్రచారం తెచ్చిపెట్టింది. అతని గెలుపు సులభమైంది. స్టేట్ సెనెటర్‌గా ఎన్నికయ్యాడు. మొదటి దఫా సెనెటర్‌గా వ్యహరించిన కాలంలో ఎన్నో శాసనాలు అమలయ్యేలా చేయడంలో ఒబామా కృషి ఫలించింది. 1998లో రెండో సారి సెనెట్‌కి పోటీ చేసి గెలిచాడు. 2002లోను గెలిచాడు. మొత్తం మూడుసార్లు పోటీచేసి ఎనిమిదేళ్ళపాటు స్టేట్ సెనెటర్‌గా పనిచేసాడు. అయితే, ఒబామా రాజకీయ జీవితంలో విజయాలే కాదు, పరాజయాలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో అమెరికా ప్రతినిధుల సభకి పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఈ ఓటమి అతనిని కుంగదీయలేదు, పైగా ఎన్నో పాఠాలు నేర్పింది. ఆత్మవిమర్శ చేసుకోడం, పొరపాట్లు ఉంటే ఒప్పుకోడం, సహచరుల అభిప్రాయాలని మన్నించడం, ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయాలు ప్రకటించడం అనే పద్దతులు ఒబామాను విలక్షణమైన రాజకీయవేత్తగా నిలిపాయి.
2004లో అమెరికా సెనెట్‌కి పోటీచేసాడు. భారీ ఎత్తున ప్రచారం చేయడానికి అవసరమైన నిధులు లేకపోడంలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు ఒబామా. నేరుగా ఓటర్ల వద్దకు వెళ్ళడం, చిన్న చిన్న సమావేశాలు, సభలు జరిపి ఓటర్లకు సన్నిహితుడయ్యాడు. ‘మనం సాధించగలం, ఆచరించి చూపగలం’ అనే ఒబామా మాటలు ఓటర్లను మంత్రముగ్ధులని చేసాయి. ప్రచారం చివరి మూడు వారాల్లో ‘యస్, వుయ్ కెన్ ‘ అనే నినాదాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. 2004 నవంబరు 4 న పోలింగ్ జరిగింది. 72% ఓట్లను సాధించి విజయం సాధించాడు ఒబామా. 2005 జనవరి 4న అమెరికా సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసాడు. సెనెట్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన ఒబామా అనేక సెనెట్ కమిటీలలో సభ్యుడిగా వ్యవహరించాడు. కొన్ని కీలకమైన బిల్లులు ఆమోదం పొందేడట్లు చొరవ చూపాడు. సెనెటర్ అయ్యాక విస్తృతి చెందిన కార్యరంగం ఒబామాని మరింతగా జనాలలోకి తీసుకెళ్ళింది. పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. తన ఆలోచనల వైశాల్యాన్ని పెంచడానికి అతను రచనలు చేసాడు. డ్రీమ్స్ ఫ్రం మై ఫాదర్, ది అడాసిటీ ఆఫ్ హోప్ అనే రెండు పుస్తకాలు అతని రచనా వ్యాసాంగానికి ప్రాసంగికతని తెచ్చిపెట్టాయి.
సెనెటర్‌గా మొదటి రెండేళ్ళ కాలంలో అతని పనితీరు, అతని మాటల ధోరణి, ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసే పద్దతి జనాలని మెప్పించాయి. ఆఫ్రికన్-అమెరికన్ అవడం, అంకితభావంతో పనిచేస్తూ పదుగురి దృష్టిలో పడిన క్రమం ఒబామాకి కొత్త రహదారిని నిర్దేశించింది. ఆఫ్రికా పర్యటన తర్వాత ఆలోచనలో స్పష్టత వచ్చింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు 10 ఫిబ్రవరి 2007నాడు ప్రకటించాడు. అయితే అతని మార్గం కఠినమైనది, సవాళ్ళతో నిండినది. డెమోక్రటిక్ పార్టీ తరపునుంచి అధ్యక్షపదవికోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడాల్సివచ్చింది. దాదాపు 17 నెలల పాటు హిల్లరీ, ఒబామాల మధ్య పోరు నడిచింది. ప్రైమరీ దశలో పలు అంశాలు చర్చకి వచ్చినా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వాన్ని ఒబామా సాధించుకున్నాడు. 2008 ఆగస్టులో ఒబామా అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు డెమోక్రాట్లు. ఇక్కడి నుంచి అసలు సమరం మొదలైంది.
రిపబ్లికన్ పార్టీ తరపున జాన్‌మెక్‌కెయిన్ అభ్యర్ధిత్వాన్ని 2008 మార్చిలో ప్రకటించారు. ఒబామా, మెక్‌కెయిన్‌ల మధ్య జరిగిన డిబేట్లలో ఒబామా ప్రదర్శించిన స్పష్షమైన వైఖరి ప్రజలలో అతని పట్ల మన్నన పెంచింది, అత్యంత ఆదరణని కల్గించింది. సంక్షోభ కాలంలో దేశాన్ని గట్టెక్కించగలిగే అనుభవం తనకు ఉందని, మెక్‌కెయిన్ గట్టిగా ప్రచారం చేసాడు. ఒబామా మాత్రం వాషింగ్టన్‌లో ‘మార్పు’ అవసరమన్న అంశాన్ని ముందుకు తెచ్చాడు. ఆర్ధిక వ్యవస్థ పతనమైన కొద్దీ మెక్‌కెయిన్ ఆదరణ తగ్గింది, ఒబామా విజయావకాశాలు పెరిగాయి. తన ప్రసంగాలలో మార్పు గురించి మాట్లాడుతూ, మనం సాధించగలం అని పదేపదే చెబుతూ ఆశలు రేకిత్తాంచాడు ఒబామా. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమై, జీవితం దుర్భరంగా మారుతున్నప్పుడు భవిష్యత్తు పట్ల ఆశని ప్రకటించడం, మార్పు సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం బాగా పనిచేసింది. ఫలితమే – ఒక సామాన్యుడైన నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికవడం. అధ్యక్ష పదవికి ఒబామాకన్నా ముందు ఎన్నికైన 43 మంది తెల్లవాళ్ళే. 44 వ అధ్యక్షుడిగా ఆఫ్రో-అమెరికన్ అయిన ఒబామాని ఎన్నుకోడం నేటి అమెరికన్ల విజ్ఞతకి, సంస్కారానికి, చైతన్యానికి ప్రతీక.
అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి 2009నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థని చక్కదిద్దే కార్యక్రమంతో మార్పుకి నాంది పలికాడు ఒబామా. ఈ విధంగా ఒబామా బాల్యం నుంచి, అధ్యక్ష పదవి చేపట్టేదాక అతని జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను ప్రస్తావిస్తూ అతని జీవితంలోని పలుపార్శ్వాలను పరిచయం చేస్తుందీ పుస్తకం. అలాగే అధ్యక్షుడయ్యాక, ఒబామా చేయాల్సిన పనులను, అతనినుంచి ఆశించే మార్పులను ప్రకటించిందీ పుస్తకం. అతని విజయాన్ని మనం ఏవిధంగా చూడాలో చెబుతుందీ పుస్తకం.
ఏప్రిల్ 2009లో ప్రచురించిన ఈ పుస్తకం వెల 55 రూపాయలు .
 ప్రతులు పాలపిట్ట బుక్స్,
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట,
 హైదరాబాదు – 500036
అనే చిరునామాలో లభ్యమవుతాయి.
ప్రచురణకర్తలను
palapittabooks@gmail.com అనే ఈ-మెయిల్‌లో సంప్రదించవచ్చు.

అనంతరం

జ్ఞాపకాల నీటి ఊట ఈ కవిత

తెలంగాణ, గ్లోబలైజేషన్, రకరకాల డిమాండ్లు, నినాదాలతో వేడెక్కుతున్న రాజకీయాలతో ప్రస్తుతం రాష్ట్ర వాతావరణం కాస్తంత గంభీరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో గడిచిన కాలంలోని హాయిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషకరమైన అనుభవాలను నెమరు వేసుకోవడం అందరూ చేసేదే.

కోడూరి విజయ్‌కుమార్ అదే పని చేశారు. కాకపోతే కాసింత కవితాత్మకంగా చేయడం వల్ల అది ‘అనంతరం’ పుస్తకరూపంలో మన ముందుకొచ్చింది. వీటి లో ‘కొన్ని పశ్చాత్తాపాలు, తండ్రులూ... కొడుకులూ..., మూడవ చిత్తరువు, జున్నుపాల వాసన, బాల్యమిత్రుడి ఫోన్‌కాల్, కొన్ని మరణాలు, రెండు ప్రపంచాలు కవితలు బాగున్నాయి. అలాగని మిగతావి బాగోలేదని కాదు...
డాలర్లను ప్రేమించిన మిత్రులకు హితవు పలుకుతూ చెప్పిన...

ఖరీదయిన జీవితం దొరకదనేగదా
ముతకమొహం వాషింగ్టన్ డాలర్ వేటలో వెళ్ళింది
నాలుగు నవ్వు మొహాలు
కనిపించడం లేదని దిగులెందుకు? కవిత కనువిప్పు కలిగిస్తుంది.
సగటు మనిషి జీవితాన్ని వర్ణిస్తూ చెప్పిన...
రెండు దోసిళ్ళనిండా నీటిని తీసుకున్నా
వేళ్ల సందుల్లోంచి అంతా పోగొట్టుకున్నట్టు
నెలంతా శ్రమించి సంపాదించినదంతా
వారంలోపలే అప్పులు, అవసరాల
బొరియల్లోకి యింకిపోతుంది
వారం గడవక ముందే మళ్ళీ వచ్చే
జీతంరాళ్ళ తేదీకై ఎదురుచూడడం
నగర జీవిత నాటకంలోని ఒక సుదీర్ఘ దుర్భర అంకం కవితయథార్ధాన్ని కళ్ళకు కడుతుంది.
రచయితకు కాని, ప్రచురణకర్తలకు గాని దీనిపై లాభాపేక్ష ఏమాత్రం లేదనడానికి దీని ధరే సాక్ష్యం.
ఇంతవరకు మూడు కవితాసంపుటులు, ఏడెనిమిది కథలు, కొన్ని వ్యాసాలు, రెండునాటికలు, పుస్తక సమీక్షలతో రచయితల జాబితాలో చోటు సంపాదించుకున్న విజయ్‌కుమార్ సామాజిక ప్రయోజనకరమైన మరిన్ని మంచి పుస్తకాలతో మన ముందుకొస్తారని ఆశిద్దాం.

- డి.వి.ఆర్.భాస్కర్

పుటలు: 87; వెల రూ. 30, ప్రతులకు: పాలపిట్ట బుక్స్,
6-11-20/6/1/1, 403, విజయ సాయి రెసిడెన్సీ, సలీమ్ నగర్,
మలక్‌పేట, హైదరాబాద్- 36.
ఇ-మెయిల్: palapittabooks@gmail.com

పాప్ సంగీతానికి రారాజు - మైకెల్ జాక్సన్

పాప్ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరిన తొలి నల్లజాతి గాయకుడు మైకెల్ జాక్సన్. దుర్భర దారిద్య్రం నుంచి, కుటుంబ హింస నుండి స్వయంకృషితో గొప్ప కళాకారుడు మైకెల్ జాక్సన్. అతని హఠాన్మరణం సంగీత ప్రియులని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగురుతునే, నెత్తురు కక్కుకుంటూ నేల రాలేందుకు సిద్ధమైన మైకెల్ జాక్సన్ అంతరంగమధనం గురించి తెలుసుకుంటే భావి తరాల కళాకారులకు మంచి పాఠాలు అందుతాయనే ఉద్దేశంతో మైకెల్ జాక్సన్ జీవితగాథని తెలుగు పాఠకులకి అందించింది పాలపిట్ట బుక్స్.

సాధారణంగా ప్రజలు కళాకారులని చూస్తారు, కళని చూసి ఆనందపడతారు. కాని ఆ కళాకారుడు కూడ తమలాంటి మనిషేనని, కళని మినహాయిస్తే, అతనిలోను మాములు మనిషిలాగే భయాలు, ఆందోళనలు, ఉద్విగ్నతలు, ఉద్వేగాలు, అసూయాద్వేషాలు, బలహీనతలు ఉంటాయని ప్రజలు గ్రహించరు. కళాకారుడి వెనుక దాగిన అసలు మనిషిని చూడరు. కళాకారుడిలోని అసలు మనిషి బయటకి రాగానే, విస్తుపోతారు. ఆ మనిషిలోని బలహీనతల ఆధారంగా కళాకారుడిని కొత్తగా అంచనా వేస్తారు. కొన్ని సార్లు చిన్నబుచ్చుతారు. కళాకారుడిగా అందరు గుర్తించి ఆదరించిన మైకెల్ జాక్సన్‌ను ఓ వ్యక్తిగా కూడా గౌరవించాలని చెప్పడానికి ఈ పుస్తకం ద్వారా రచయిత కస్తూరి మురళీకృష్ణ ప్రయత్నించారు.

మైకెల్ జాక్సన్ బాల్యం నుంచి పాప్ సంగీత రారాజుగా ఎదిగిన వైనాన్ని ఈ పుస్తకంలో చక్కగా వివరించారు రచయిత. నిజమైన మైకెల్ జాక్సన్ ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ప్రతీ వ్యాసంలోను పరిచయక్రమంలో రాసిన వాక్యాలు మైకెల్ జాక్సన్‌ని కొత్త కోణంలో చూపుతాయి, అప్పటి దాక అతనిపై ఉన్న అపోహలను దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేస్తాయి. సోదరులతో సంగీత బృందంగా ఏర్పడి పాటలు పాడే స్థాయినుంచి, సోలోగా పాటలు పాడే స్థితికి జాక్సన్ ఎదిగిన తీరుని రచయిత చక్కగా విశదీకరించారు. అతని జీవితంలోని తొలిదశలోని భయాలను, ఆందోళనలను హృద్యంగా చిత్రించారు. గాయకుడిగా గుర్తింపు లభించినప్పటినుంచి, సూపర్‌స్టార్‌గా ఎదిగేవరకు విడుదలైన ఆల్బమ్ ల గురించి, వాటిని రూపొందించడంలో జరిగిన కృషి గురించి సవివరంగా తెలిపారు.

థ్రిల్లర్ ఆల్బమ్ ప్రచారం కోసం ఓ ప్రదర్శనలో మైకెల్ జాక్సన్ చేసిన మూన్‌వాక్ అనే నృత్యవిన్యాసాన్ని కళ్ళకి కట్టినట్లు వర్ణించారు. అదే సమయంలో అతని జీవితంలో చుట్టుముట్టిన వివాదాలు, పుకార్లు, వాస్తవాల గురించి చర్చించారు. మైకెల్ జాక్సన్ జీవితంలో విజయాలు, వివాదాలు ఉన్నాయి. మొదట తన మీద తనకి అపనమ్మకం, తోడు కోసం తపించడం, అద్భుతమైన విజయాలు, అహంకారం, పునర్విహాలు, కోర్టు కేసుల్లో ఇరుక్కోడం వంటి పతనోత్థాలు వీటికి నిదర్శనం.

అతను ఎదుర్కున్న అవమానాలు, ఆరోపణలు, క్షీణిస్తున ఆరోగ్యం, క్రుంగదీస్తున్న ఆర్ధిక పరిస్థితులను ప్రస్తావించారు. ఇలా కీర్తి ప్రతిష్టలు దిగజారినప్పుడల్లా మరో కొత్త ఆల్బమ్‌తో ప్రజలని మరిపించిన తీరుని విశ్లేషించారు. చివరగా కోర్టు కేసులలో ఆరోపణలు నిరూపితం కాకపోవడం, మైకెల్ జాక్సన్ నిర్దోషిగా బయటపడం గురించి తెలిపారు.

జీవితంలో దెబ్బతిని, ఓడిపోయి, నిరాశలో మగ్గి, ఆత్మవిశ్వాసంతో తలెత్తి ఉన్నత శిఖరాలకు చేరుకున్న విధానాన్ని ఫీనిక్స్ పక్షి ఉదంతంతో పోల్చారు. ప్రజల గుండెలలో గాయకుడిగా తానింకా బ్రతికున్నానని నిరూపించుకోడం కోసం మైకెల్ జాక్సన్ ప్రపంచవ్యాప్తంగా 50 సభలలో పాడేందుకు అంగీకరించడం, వాటి సన్నాహాలలో సాధన చేస్తూ మరణించడం గురించి రచయిత వివరించిన తీరు చదువరులను ఆకట్టుకుంటుంది.

రచయిత మాటల్లోనే చెప్పాలంటే. . . . "‌నల్లవాడిగా సమాజం చూపే వివక్ష, బాల్యంలో అభద్రతా భావం, సెలెబ్రిటీగా మారిన తర్వాత నన్నెవరూ ఏమీ చేయలేరనే ధైర్యం, సూపర్‌స్టార్ అయిన తర్వాత ఎక్కడ తన స్టార్‌డమ్ చేజారిపోతుందనే భయం, దీనికి తోడు విపరీతంగా అందుతున్న ధనం వల్ల కోల్పోయిన బాల్యాన్ని పరోక్షంగా అనుభవించాలన్న తపన, ఆరోపణల వలన చెదిరిన ఆత్మస్థైర్యం, దాన్ని కళ ద్వారా అధిగమించాలన్న ప్రయత్నం, కాని ఎంత ధనం ఉన్నా, ఎంత కళాకారుడైనా, నిరంతరం సాగుతున్న ఎదురుదాడికి లొంగక తప్పదన్న గ్రహింపు, ఫలితంగా ఆత్మవిశ్వాసం కోల్పోడం, కళాకారుడి స్థానంలో ఓ మానసిక రోగి, నిరాశ నిస్పృహలతో మిగలడం.. చివరికి మరణం.." ఇదీ టూకీగా మైకెల్ జాక్సన్ జీవితం.

సెలెబ్రిటీ అవడం, డబ్బు సంపాదించడం కన్నా, భావితరాలకు మనం నేర్పవలసింది జీవితంలో సమతౌల్యం సాధించడం, మానసిక ప్రశాంతతని సాధించడం అనే గుణపాఠాన్ని మైకెల్ జాక్సన్ జీవితం మనకు చెబుతుందని రచయిత అభిప్రాయపడ్డారు. ఈ నిజాన్ని మన సమాజానికి చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రచించినట్లు రచయిత తన ముందు మాటలో చెప్పారు.



పాలపిట్ట బుక్స్ ఆగస్టు 2009
144 పేజీల ఈ పుస్తకం వెల 60 రూపాయలు .
ప్రతులు పాలపిట్ట బుక్స్,
 16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ,
సలీంనగర్, మలక్‌పేట,
 హైదరాబాదు - 500036
  palapittabooks@gmail.com  సంప్రదించవచ్చు.

మధుపం (ఒక మగవాడి ఫీలింగ్స్)

రాసిన వారు: మాధవ్ శింగరాజు
***********************
(2009లో ప్రచురితమైన మధుపం: ఒక మగవాడి ఫీలింగ్స్ (రచన: పూడూరి రాజిరెడ్డి) పుస్తకానికి ముందుమాట ఇది. ఈ పుస్తకం పై గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవండి.)
 బాలుడు రాజిరెడ్డితో ముక్కలు ముక్కలుగా నాకు ఒకటిన్నరేళ్ల పరిచయం. ముక్కల్ని మాత్రమే కలిపిచూస్తే… కొన్ని పని గంటల పరిచయం. ఒక స్మాల్ పెగ్గు నిడివైనా లేని పరిచయం. ఈ నిడివిలోనే అనేకసార్లు అసందర్భంగా అతడితో కలిసి టీ తాగాను. నిరర్థకంగా కలిసి భోజనం చేశాను. నిస్సారంగా ఆఫీసు లిఫ్టులో కిందికీ, పైకీ కలిసి ప్రయాణించాను.
బాలుడు రాజిరెడ్డిలో నాకెలాంటి ఆసక్తీ లేదు. నిజం. స్త్రీని తట్టుకునే శక్తి రాజిరెడ్డికి లేదని నేను గ్రహించేవరకూ… అతడిలో నాకెలాంటి ఆసక్తీ కలగనేలేదు. స్త్రీ సౌందర్యం నిర్దాక్షిణ్యంగా, దౌర్జన్యంగా జరిపే అత్యాచారానికి చేతులు అడ్డుపెట్టుకోవడం ఇష్టంలేక దుఃఖితుడౌతున్నాడంటే… వాడిక బాలుడు కాడు. మనసును గట్టిగా కావలించుకుని వెళ్లిన ఆడమనిషి కోసం అన్నం నీళ్లు మాని, పులుపు తింటున్నాడంటే వాడు బాలుడు కాడు. రాజిరెడ్డి బాలుడు కాదని తెలిశాక, నేను స్త్రీగా పుట్టకపోవడంలోని సృష్టి అనౌచిత్యానికి అనేకసార్లు ఆకాశంలోకి చూశాను.
రాజిరెడ్డి “టచ్” బాగుంటుంది. స్త్రీని రఫ్ గా నిమురుతాడు. స్త్రీ కోరుకునే మొరటుతనం అది! బయట నిలబడి చూస్తే ఏమీ అర్థం కాదు. అతడి పక్కన పడుకోవాలి. అప్పుడు ఏ అపార్థాలూ ఉండవు. రాజిరెడ్డి స్త్రీని ప్రేమించే విధానం… రామదాసు శ్రీరాముడిని తిట్టినట్లు ఉంటుంది. రాజిరెడ్డి స్త్రీని ద్వేషించే విధానం… భక్తుడు దేవుడి కాళ్లమీద పడినట్లు ఉంటుంది. నిజమైన స్త్రీకి, నిజమైన దేవుడికి తప్ప మిగతావాళ్లకి రాజిరెడ్డి అందడు. వాడు మగాడు. మీసాలొచ్చాక రాజిరెడ్డి ముచ్చటపడి కుట్టించుకున్న మొదటి డ్రెస్… ఈ పుస్తకం. విప్పిచూస్తే అతడెంత పెద్ద మగాడో తెలుస్తుంది. కొన్నిచోట్ల అతడి గడ్డం మాసి, కళ్లు గుంటలు పడి వుంటాయి. కొన్నిచోట్ల అతడి ఒంటికి బొట్టుబిళ్లలు అంటుకుని ఉంటాయి. ఫ్రాయిడ్, ఫుకుఓకా, పాలోకొయిలో… కృష్ణమూర్తి, గాంధీ, గోపీచంద్… బుద్ధుడు, లూథర్ కింగ్, టాల్ స్టాయ్… ఇంతమంది తెలివిగా, తాత్వికంగా పెంచుకున్న రాజిరెడ్డిని… బొడ్డూడని ఒక ఆడపిల్ల… చేతిలో గరిటెతో, కళ్ల కాటుకతో ఆటాడించడంలోని ప్రకృతి ఆంతర్యం పుస్తకంలో అక్కడక్కడా కనిపిస్తుంది. పైపై చూపులకు కనిపించని రాజిరెడ్డి మాత్రం… పుస్తకం చివర్లో ఒంటరి తాత్వికుడై దిగంబరంగా నిలబడి ఉంటాడు… “నేనెవరు?” అనుకుంటూ!
రాజిరెడ్డి నవ్వు బాగుంటుంది. కడుపులో ఉన్నదంతా నవ్వేస్తాడు. ఆఫీస్ ఎదురుగా “సర్వీ”లో ఇటాలియన్ బేకరీ ఐటమేదో తింటున్నాం ఒక వేసవి మధ్యాహ్నం నేను, రాజిరెడ్డి. రాస్తున్నదాన్ని సగంలో ఆపి వచ్చాడు నాకోసం. రాజిరెడ్డి వాక్యం “స్ప్రయిట్”లా ఉంటుంది. సుత్తి పట్టుకుని తీర్పులివ్వడు. అసలు పీఠం మీద కూర్చోడానికే ఇష్టపడడు. హోదాను మరిచి కిందికి దిగుతాడు. బోన్లోనుంచి నిందితుడిని విడిపించుకుని, భుజం మీద చెయ్యి వేసి వరండాలోకి నడిపించుకుని వెళ్తాడు. ఆ వెళ్లడం… తన సమస్యను చెప్పుకోడానికి వెళ్లినట్టు ఉంటుంది! రాజిరెడ్డి రక్తనాళాలన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా కుట్టొచ్చు.
ఆ మాటకు పెద్దగా నవ్వాడు రాజిరెడ్డి. రాయడం మన అవసరమేగానీ ఎవరికీ పెద్దగా అక్కర్లేదని అన్నాడు. అని, మళ్లీ పెద్దగా నవ్వాడు! పుస్తకం వెయ్యడమంటే వెయ్యిరూపాయల నోట్లను బౌండు చేయించి పరిచయస్తులకు పంచిపెట్టడమేనని అన్నాడు.
కేర్ హాస్పిటల్ దగ్గర రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నాం… తిరిగి ఆఫీసులోకి.
వెహికల్స్ మమ్మల్ని దాటనివ్వడం లేదు. మనుషులు మేఘాల్లో వెళుతున్నారు.
అంత వేగంతో “న్యూ ఎరైవల్స్”కోసం పుస్తకాల షాపుకు వెళ్లేవారెవరైనా ఉంటారా?!
ఉంటారన్న నమ్మకం రాజిరెడ్డికి కలగడానికి కాస్త టైమ్ పట్టింది అంతే.
మధుపం (ఒక మగవాడి ఫీలింగ్స్)
రచన: పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 126
వెల: రూ. 45
ప్రతులకు: పాలపిట్ట పబ్లికేషన్స్
16-11-20/6/1/1
403, విజయసాయి రెసిడెన్సీ
సలీంనగర్, మలక్ పేట్
హైదరాబాద్-36
ఫోన్: 9848787284
మెయిల్: palapittabooks@gmail.com

ఆమె ఎవరైతే మాత్రం – శివారెడ్డి కవిత్వ సంకలనం

మోహనా! ఓ మోహనా!’ కవితా సంపుటికి 1990లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డునందుకున్న కవి కె. శివారెడ్డి వెలువరించిన కొత్త కవిత్వ సంకలనం ‘ఆమె ఎవరైతే మాత్రం’.
‘సాహసంతో జీవితాన్ని తమ ఇష్టమొచ్చినట్టు
మలచుకొనేవాళ్లకు జై
ప్రపంచానికి ముగుదాడేసి తమ వెంట
నడిపించుకుపోతున్న స్త్రీమూర్తులందరికీ జై ‘
అంటూ ఆయన స్త్రీలందరికీ అంకితమిచ్చిన ఈ కవితల పుస్తకాన్ని కిందటివారమే హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. అంతకుముందు రోజు కవి వీటిని చదివి వినిపించిన కార్యక్రమం కూడా జరిగింది. సమాచారం తెలిసినా పని భారంలో రెండుసార్లూ వెళ్లలేకపోయానుగానీ, పుస్తకం చేతికొచ్చిన తర్వాత చదవకుండా మాత్రం ఉండలేకపోయాను.
‘సగటు మగాడిలా ఎక్కడా స్త్రీని తప్పు పట్టకుండా, న్యూనపరచకుండా, ఆమె ప్రతి కదలికకూ, ప్రతి ఆలోచనకూ, ఆచరణకూ కారణాలను వ్యవస్థలో వెతుక్కుంటూ ‘ఆమె’ను అపార సానుభూతితో, ప్రేమతో, కరుణతో ఆశ్లేషించుకోవడం ఈ కవితలలోని ప్రత్యేకత’ అంటూ ప్రచురణకర్తలు పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి చెబుతున్నారు.
అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిని పోగొట్టుకున్న కవి శివారెడ్డిని అతని నాయనమ్మ పెంచారు. చిన్నతనంలో ఆయనపై చెరగని ముద్ర వేసిన శ్రమసౌందర్య ప్రతినిధులు మాలకొండమ్మ, శకుంతలమ్మతో పాటు జీవితం ప్రతి అడుగులోనూ తారసపడిన స్త్రీలలో ఏదోక విలక్షణతను చూసిన కవి కలం ఈ తరహా కవితలు రాయడం సహజమే. ‘అయిదేళ్ల ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న ఒక పల్లెటూరి బాలుడికి ప్రపంచం ఒక వేయి తలల నాగుపాము. జీవితం ఒక భయం, ఒక దరిద్రం, ఒక అనాదరణ. అనాథబాల్యాలు కానీ, ఆర్ద్రత లోపించిన పిలుపులుగానీ, ఏకాకితనాలు కానీ, అర్థం కాని సంబంధాలు కానీ, అన్నీ అన్నీ భయంభయంగా నాలో మిగిలి నా అంతర్లోకాలన్నింటినీ ముట్టించి ఊదరబెట్టి ఊపిరాడక అరిస్తే, అమ్మా! అంటే పలికే గొంతు లేనప్పుడు – బహుశా ఇవన్నీ నా కవిత్వంలో అదృశ్యంగా నర్తిస్తూ ఉంటాయేమో’ అని చెబుతారు శివారెడ్డి. ఆ అనుభూతి నిజాయితీగా వ్యక్తమవుతుంది ఈ పుస్తకంలో. కవిత్వమంటే ఇష్టం, స్త్రీత్వం పట్ల ప్రేమ ఉన్నవారందరూ చదవాల్సిన పుస్తకం ‘ఆమె ఎవరైతే మాత్రం’
దాన్నుంచి మచ్చుకో కవిత :
ఆమెకలదు
ఏం చేస్తావు ఆమెని
ఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవా
నీ రెండు కళ్లను పీకి
ఆమె అరచేతుల్లో పెట్టగలవా
ఎన్నో జన్మల నుంచి నడుస్తున్న
ఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవా
ఏం చేస్తావు ఆమెని
నాలుక చివరతో ఆమె కంట్లోని నలకను తీయగలవా
గుండెలో విరిగిన ముల్లును
మునిపంటితో బయటికి లాగగలవా
భూమిపొరల్లో ఖనిజంగా ఉన్న
ఆమెను తవ్వి తలకెత్తుకోగలవా
చిన్నపిల్లలా భుజానెక్కించుకుని
విశ్వమంతా ఊరేగించగలవా
ఏం చేయగలవు నువ్వు
చెదిరిన ముఖంగలవాడివి
చీలిన నాలుకలవాడివి
తలాతోకా తెలియని
మొండెపుతనంతో ఊరేగుతున్నవాడివి
రహస్య సంకేతాల కేంద్రమయిన ఆమెను
ఛేదించగలవా చదవగలవా
చిరుమువ్వల పువ్వులు ధరించి
తిరుగుతున్న ఆమెను వినగలవా
వీనులతో చూడగలవా
ఆమెనేం చేయగలవు
‘అడవి ఉప్పొంగిన రాత్రి’లాంటి ఆమెను
అందుకోగలవా అనువదించగలవా
ఆరుబయట వెన్నెట్లో
అమోఘంగా చలించే ఆమెను
తాకగలవా, తాకి తరించగలవా -
ఆమె ముందొక శిశువై
దిగంబరంగా నర్తించగలవా
ఆమె గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించగలవా
ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి సేదదీరగలవా
నీ అస్తిత్వాన్ని మర్చిపోయి
ఆమె అస్తిత్వాన్ని గుర్తించగలవా
ఏం చేయగలవు
ఏం చేయలేని వెర్రిబాగులాడా
వెదకటం తెలియాలిరా
మనుషుల్లో మనుషుల్ని వెదకటం తెలియాలిరా
నీలో నువ్వు కొట్టుకుపోతున్న నిన్ను
ఆమె రక్షించగలదు
ఆమె కలదు, నువ్వు లేవు.
(22 ఫిబ్రవరి 2009 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం)

152 పేజీలున్న ఈ పుస్తకం వెల 50 రూపాయలు.
రచురణకర్తల చిరునామా :
పాలపిట్ట బుక్స్‌, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ
సలీం నగర్‌, మలక్‌పేట్‌, హైదరాబాద్‌ -036
ఈమెయిల్‌ palapittabooks@gmail.com

ఆకాశం: నా కొత్త కవిత్వ సంకలనం

మీరు కవిత్వ ప్రేమికులై, కొంతసేపైనా మనశ్శాంతిని కలిగించగల కవిత్వం కావాలనుకొంటే ఆకాశం చదవండి.

'ఆకాశం' కవిత్వం అతి సున్నితమైన జీవన స్పర్శ నుండీ, ప్రగాఢమైన తాత్విక చింతన నుండీ వ్యక్తమైంది. దీనిని నేను పాఠకుడికి కేవలం కావ్యానందం ఇవ్వటం కోసం రాయలేదు. ఈ కాలం సాహిత్య వాతావరణం లో బాగా ప్రచారం లో ఉన్న సామాజిక, రాజకీయ స్పృహ తోనూ రాయలేదు. 
నా జీవితానుభావాన్నుండి, చింతన నుండీ నేను జీవితం అంటే ఏమిటి అనుకొంటున్నానో, జీవిత లక్ష్యం ఏమిటి అనుకొంటున్నానో, మరింత ఉన్నతమైన, ఉదాత్తమమైన జీవితానుభవం కావాలంటే మనం ఎలా అనుభూతించాలో, ఆలోచించాలో, వేటిని ధ్యానించాలో, వేటిని ఉపేక్షించాలో నాకు చాతనైనంత వరకూ చెప్పటానికి ప్రయత్నించాను. అయితే సౌందర్యావిష్కారం కవిత్వ ప్రధానధర్మమని నమ్మటం వలన చాతనైనంత సౌందర్య స్ప్రహతోనే రాశానని, చాలావరకూ సఫలమయ్యాననీ చెప్పగలను. 
ఇటువంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వం గా పిలవటం సాహిత్య ప్రపంచం లో వాడుక. అంటే జీవన మౌలిక సత్యాలను వెదికేది, అనుభవం లోకి తెచ్చే ప్రయత్నం చేసేది అని. టాగోర్, సూఫీ కవులు, కన్నడ శివకవులు, కొన్ని సందర్భాలలో మన అన్నమయ్య, వేమన, పోతన లు, ఖలీల్ జిబ్రాన్ ఈ తరహా కవిత్వం రాసిన వారిలో కొందరు. జపాన్ కు చెందిన హైకూ కూడా ఇటువంటి కవిత్వమే.
కాలం గడిచే కొద్దీ చింతన కన్నా, అనుభవానికి ప్రాధాన్యత పెరుగుతోంది. అందువలన కవిత్వం కూడా, కొన్ని ఆలోచనలను ప్రోది చెయ్యటం కన్నా, సరాసరి అనుభూతినీ, అనుభవాన్నీ ఇవ్వటానికే ప్రయత్నం చెయ్యవలసి ఉంటుందని నా భావన. అందువలన నా కవిత్వం అనుభూతీ లేదా అనుభవ ప్రధానం గా ఉంటూ వచ్చింది నా వచన కవిత్వం లోనూ, హైకూలలోనూ కూడా. అయితే ఇటువంటి కవిత్వం రాయటానికి కవికి ఎంత సాంద్రమైన అనుభవాన్ని పొందే శక్తీ, అభివ్యక్తి  నైపుణ్యమూ కావాలో, పాఠకుడికి కూడా ఆ శక్తులు అంతగానూ కావాలి. తేలికైన మాటలలో చెప్పాలంటే, జీవితం లోని విషయాల పట్ల మాత్రమే కాకుండా, మొత్తం జీవితం పట్ల శ్రద్ధ కావాలి. కనీసం తనతో తాను నిజాయితీగా ఉండగల స్వచ్చత కావాలి.
కవినో, కవిత్వాన్నో తెలుసుకోవటం కోసమో, కాలక్షేపం కోసమో కాకుండా, మీ హృదయం నిజంగా జీవితానుభవాల వల్ల బరువెక్కి ఉంటే, మీ మనసే మీకు  పిచ్చి గీతలు గీసిన కాగితంలా కనిపిస్తూ, అసహనానికి గురి చేస్తుంటే, జీవితం ఏమిటి, ఎందుకు వంటి ప్రశ్నలు మిమ్మల్నిలోపల ఎక్కడో ముల్లులా గుచ్చుతూ ఉంటే, ఈ కవిత్వం తప్పక చదవమని చెబుతాను. ఇది తప్పక మీ లోలోపలి శాంతికీ, స్పష్టతకీ ఒక మంచి స్నేహితుడిలా సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నాను.

ఈ పుస్తకం పాలపిట్ట ప్రచురణ గా దొరుకుతోంది. ఇప్పుడు కినిగే.కామ్ లో ఈ బుక్ రూపంలో కూడా లభిస్తోంది. 

ఆకాశం: నా కొత్త కవిత్వ సంకలనం వచ్చింది
100 కవితలు, 140 పేజీలు, రూ. 70
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
# 16-11-20/6/1/1, # 403,విజయసాయి రెసిడెన్సీ, 
సలీంనగర్, మలక్ పేట్, హైదరాబాద్ 500 036 
cell:9848787284